సెక్స్‌వర్కర్ల కుమార్తెలు బురదలో పూసిన పూలు

ఇక్కడ బురద అంటున్నది వేశ్యావాటికను కాదు. వేశ్యావాటికను బురద అనే దృష్టికోణమే తప్పు అంటారు ఆ అమ్మాయిలు. సమాజమే ఒక బురద కావచ్చు...అదే ఈ బురదను తయారు చేస్తుండవచ్చు అని కూడా అంటారు. వేశ్య కూతురు వేశ్య అవుతుందని నియమం. కాదు.. సమాజ పరివర్తన కార్యకర్త అవుతుందనినిరూపిస్తున్నారు ఈ ఆశాదీపాలు. ‘స్టాప్‌ జడ్జింగ్‌.. స్టార్ట్‌ ఇంక్లూడింగ్‌’... ‘తీర్పులు ఆపండి...


ముంబైలోని కామాటిపురా నుంచి కుర్లాకు నలభై నిమిషాల ప్రయాణం. కాని ఆ ప్రయాణం కొందరికి ఒక జీవితకాలంలో సంభవించకపోవచ్చు. కామాటిపురా నుంచి బయటపడి కుర్లాలోని ‘క్రాంతి’ ఎన్‌.జి.ఓకు చేరిన వారికి ఒక కొత్తప్రపంచం వీలవుతుంది. ‘క్రాంతి’ సంస్థ వేశ్యలకు పుట్టిన కుమార్తెలకు కొత్త జీవితం ఇవ్వడానికి పని చేస్తోంది. వారి కలలు సాకారం కావడానికి రెక్కలు ఇస్తోంది. ఎగిరి వెళ్లదలుచుకుంటే ఎంత దూరమైనా ఎగరనిస్తుంది.‘2009లో నేను క్రాంతి సంస్థను ప్రారంభించే వరకు ముంబైలోని కొన్ని ప్రభుత్వ సంస్థలు, ఎన్‌.జి.ఓలు వేశ్యల సంతానానికి కొత్త జీవితం ఇచ్చే ప్రయత్నం చేశాయి. అయితే ఆ జీవితం పరిమితమైనది. వారికి మహా అయితే అప్పడాలు తయారు చేయడం, కుట్టుపని నేర్పించడం చేసేవారు. తర్వాత వారి బతుకు ఎక్కడి గొంగళి అక్కడే ఉన్నట్టుండేది. ఆ ఆడపిల్లలు ఏ కలలు కంటే ఆ కలలకు తోడు ఇవ్వాలి అని అనుకున్నాను’ అంటుంది రాబిన్‌చౌరాసియా. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ భారతీయురాలు అక్కడి మిలట్రీలో పని చేసి, అక్కడ లెస్బియన్ల పట్ల, గేల పట్ల ఉన్న వివక్షను వ్యతిరేకించి ఉద్యోగం మానేసింది. నేరుగా ఇండియాకు వచ్చి సెక్స్‌వర్కర్ల కుమార్తెల కోసం పని చేయడం మొదలెట్టింది. ముంబైలోని కుర్లాలో ఈమె స్థాపించిన సంస్థ తలుపులు 24 గంటలూ తెరిచి ఉంటాయి. ఏ సమయంలో అయినా ఏ వేశ్యావాటిక నుంచి అయినా ఏ అమ్మాయి అయినా ఇక్కడికి రావచ్చు. తల దాచుకోవచ్చు.