న్యూఢిల్లీ : కరోనా వైరస్( కోవిడ్ 19)పై వస్తున్న వదంతులను నమ్మొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం ఆయన జన ఔషధీ కేంద్రాల యజమానులు, ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన(పీఎంబీజేపీ) లబ్ధిదారులతో సంభాషించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..కరోనా వైరస్‌పై వస్తున్న పుకార్లను నమ్మొద్దని, డాక్టర్ల సలహాలు పాటించాలని ప్రజలను కోరారు. షేక్ హ్యాండ్ బదులు నమస్తే పెట్టాలని సూచించారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం నమస్తే పెట్టడం అలవాటు చేసుకుంటోందని అన్నారు.
లబ్దిదారులతో మాట్లాడే క్రమంలో ప్రధాని మోదీ భాగోద్వేగానికి లోనయ్యారు. పక్షవాతానికి లోనై.. జన ఔషధి పథకం ద్వారా లబ్ది పొందిన దీపా షా అనే ఓ మహిళ మాట్లాడిన మాటలు విని మోదీ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. సరిగా మాట్లాడలేకపోయిన తాను.. తన రోగాన్ని సరిచేసుకునేందుకు ఎంతో ఖర్చయ్యే పరిస్థితి ఎదుర్కొన్నాననీ, ఐతే... జన ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ రేటుకే మందులు కొనుక్కొని సమస్య నుంచీ బయటపడినట్లు మోదీకి వివరించారు.